కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నిరుపేదలను ఆదుకోవడానికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ పేరుతో రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే మూడు నెలల పాటు ఈ ప్యాకేజీని అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం విదితమే.
ఈ ప్యాకేజీ కింద 33 కోట్ల మంది నిరుపేదలకు రూ. 31,325 కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జన్‌ధన్ ఖాతా ఉన్న 20.05 కోట్ల మంది మహిళల అకౌంట్లలోకి రూ. 10,025 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలిపింది. 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ. 1405 కోట్లు పంపిణీ చేసింది. పీఎం - కిసాన్ పథకం కింద.. 8 కోట్ల మంది రైతులకు రూ.16,146 కోట్లు పంపిణీ చేసింది. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ కింద రూ. 162 కోట్లను 68,775 సంస్థలకు ట్రాన్స్‌ఫర్ చేశాం. దీని వల్ల 10.6 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.